నగరం మూవీ రివ్యూ మరియు రేటింగ్

Nagaram Movie Review

విడుదల తేదీ: మార్చ్ 10, 2017

దర్శకత్వం: లోకేష్ క‌న‌క‌రాజ్‌

నటీనటులు: సందీప్ కిష‌న్‌, రెజీనా, శ్రీ, చార్లీ, మ‌ధుసూద‌న్

నిర్మాత: అశ్వ‌నికుమార్ స‌హ‌దేవ్‌

సంగీతం: జావేద్ రియాజ్‌

మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కిషన్ తాజాగా ‘నగరం’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం తమిళ్ మరియు తెలుగు విడుదలయింది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం….

కధలోకి వెళ్తే:

ప్రస్తుతం మహానగరాలలో ఒకరి జీవితం ఇంకొకరి జీవితంతో ఎలా కనెక్ట్ అయివుంటుందో, అలాగే ప్రస్తుతం ఈ మహానగరాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలపడానికి దర్శకుడు కనగరాజ్ నిజాయితీగా చేసిన ప్రయత్నమే ఈ నగరం. ఈ సినిమా అంతా సమాంతరంగా నడిచే నాలుగు విడి విడి కథల ఆధారంగా నడుస్తుంది.

1. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న అమ్మాయి, వుద్యోగం లేకుండా కాళిగా వుండే అబ్బాయిల మధ్య ప్రేమకథ
2. ప్రేమకోసం పల్లెటూరినుండి నగరానికి వచ్చిన యవకుడు
3. ఉపాధి కోసం నగరానికి వచ్చి టాక్సీ డ్రైవర్ గా పనిచేసే వ్యక్తి
4. అందర్నీ భయపెట్టే పెద్ద క్రిమినల్

వీరి జీవితాలు ఎలా రెండురోజులలో ఎన్ని మలుపులు తిరిగాయో….అవన్నీ ఒకే సంఘటనతో ఎలా ముడిపడి ఉన్నాయో తెలిపే థ్రిల్లర్ ఈ సినిమా.

ఎలా ఉందంటే..?:

అతి సంక్లిష్టమైన కధని, చక్కని స్క్రీన్ ప్లే తో ఎక్కడా తికమక పెట్టకుండా చక్కగా అర్ధమయ్యేలా నడిపించాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. తీసుకున్న కదా నేపధ్యం, ఎంచుకున్న తారాగణం, స్క్రీన్ ప్లే, కెమెరా వర్క్ చక్కగా వున్నాయి. దర్శకుడు రాసుకున్న కథను చాలా బాగా చెప్పాడు, నాలుగు విడివిడి కథలను ఒకటిగా కలుపతూ సినిమాను నడపడంలో, నటీ నటుల నుండి మంచి పెర్ఫార్మెన్స్ రాబట్టడంలో అతను పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కథనంలోని ప్రతి అంశాన్ని అర్థమయ్యేలా వివరించాడు. సందడిప్ కిషన్, రెజినా, మినహా మిగిలిన అందరూ పూర్తిగా తమిళ తారాగణం అవడం, సాగదీసిన సన్నివేశాలు, తమిళ నేటివిటీ ఎక్కువగా ఉండడంతో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవడం కొంచెం కష్టం. చివరి వరకు ప్రేక్షకుడికి అదే వెలితిగా అనిపిస్తుంది. ఈ వెలితి మినహా, సినిమా లో చెప్పుకోవాల్సిన మైనస్ పాయింట్స్ పెద్దగా ఏమి లేవు.

సందీప్ కిషన్ హీరో ఇమేజ్ ను వదిలేసి ఒక నటుడిగా కథలోని పాత్రలో కలిసిపోయాడు. నిర్లక్ష్యం ఉన్న కుర్రాడిగా అతని లుక్స్, హావభావాలు, నటన అన్నీ మెప్పించాయి. పల్లెటూరినుండి నగరానికి వుద్యోగం కోసం వచ్చిన యువకుడి పాత్రలో యువ నటుడు శ్రీ కూడా బాగా నటించాడు. మొదటి భాగం మొత్తాన్ని పాత్రల పరిచయాలు, వారి పరిస్థితులు, మంచి ఆసక్తికరమైన కిడ్నాప్ సన్నివేశాలతో చాలా బాగా నడిపాడు దర్శకుడు. ఇక సెకండాఫ్ అంతా ఒక్కొక్క పాత్ర కథలో ఇన్వాల్వ్ అవుతూ చాలా బాగా తయారైంది. చిన్న చిన్న కథలను కలిపి మంచి కథనంతో ప్రధాన కథను తయారు చేయడం మెప్పించింది. అలాగే మహా నగరాలలో నేరాలు జరిగే విధానాన్ని రియలిస్టిక్ గా చూపడం బాగుంది.

మొత్తం మీద స్లో సీన్స్, రెగ్యులర్ తెలుగు సినిమాల్లో ఉండే ఎంటర్టైన్మెంట్ ఇందులో పెద్దగా లేకపోవడాన్ని పట్టించుకోకపోతే ఈ ‘నగరం’ చిత్రం థ్రిల్లర్ ను ఇష్టపడే వారికి మంచి చాయిస్ అవుతుంది.

సాంకేతిక వర్గం పని తీరు…?:

ఈ సినిమాలో సాంకేతిక విభాగం పని తీరు గొప్పగానే ఉంది. ముఖ్యంగా సెల్వకుమార్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. క్రైమ్ సన్నివేశాల్ని చాలా రియలిస్టిక్ గా చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బింగ్ కూడా తగిన విధంగా ఉంది. సౌండ్ డిజైన్ డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మామూలు థ్రిల్స్ ని కూడా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చాలా ప్రభావవంతంగా చూపించారు.

బలాలు:

  • నటీనటుల నటన
  • కథ కథనాలు
  • డైరెక్షన్
  • కెమెరా వర్క్
  • బాక్గ్రౌండ్ మ్యూజిక్

బలహీనతలు:

  • తమిళ నేటివిటీ
  • కొన్ని స్లో సీన్స్
  • తక్కువగా వున్న కామెడీ సీన్స్

రేటింగ్:  3/5

Add Comment

Click here to post a comment