‘కళాకారులను గౌరవించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా పలువురు అవార్డులు ఇస్తున్నారు. కానీ, ప్రజాభిప్రాయాన్ని సేకరించి, అవార్డులు ఇవ్వడం మా ‘టీఎస్సార్‌–టీవీ9’ అవార్డుల ప్రత్యేకత. గత ఆరేళ్లుగా పాటిస్తున్న ‘ఎస్‌ఎమ్‌ఎస్‌’ పోల్‌ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నాం’’ అన్నారు కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి.

టీవీ9 ఛానల్‌తో కలిసి ప్రతి ఏడాది ‘టీఎస్సార్‌– టీవీ9’ అవార్డులను ఆయన అందజేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం 2015, 2016 సంవత్సరాలకు గాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, పంజాబీ, హిందీ రంగాల్లో నామినేషన్‌లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ…. ‘‘కళాకారులంటే నాకెంతో అభిమానం. వాళ్లను సత్కరించడం ద్వారా నాకెంతో ఆత్మసంతృప్తి లభిస్తుంది.

ఈసారి విశాఖలో 50 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో అవార్డుల వేడుకను నిర్వహించాలనుకుంటున్నాం. దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకున్నాం. మార్చి 8 నుంచి నెల రోజుల పాటు టీవీ9లో ప్రేక్షకులు తమకు నచ్చిన స్టార్, టెక్నీషియన్‌ లను అవార్డుకు ఎంపిక చేసుకునే ఎస్‌ఎమ్‌ఎస్‌ పోల్‌ జరగనుంది. ఏప్రిల్‌ 8న విశాఖ క్రికెట్‌ స్టేడియమ్‌లో ఈ వేడుక జరుపుతాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అవార్డ్స్‌ కమిటీ జ్యూరీ సభ్యులు బి. గోపాల్, పీవీపీ, రఘురామ కృష్ణంరాజు, జయసుధ, జీవిత, మీనా, పింకీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Post

Comments

comments