‘భలే భలే మగాడివోయ్’ ముందు వరకు నానిది ఒక లెక్క. ఆ సినిమా తర్వాత మరో లెక్క. ఆ సినిమాను అమెరికాలో ఏకంగా 110 స్క్రీన్లలో రిలీజ్ చేస్తుంటే చాలామంది సెటైర్లు వేశారు. నాని ఏమైనా స్టార్ హీరో అనుకుంటున్నారా.. తేడా కొడితే వచ్చే కలెక్షన్లు ఖర్చులకు కూడా సరిపోవని ఎద్దేవా చేశారు. కానీ ఎవరు ఊహించని రీతిలో ఆ సినిమా అద్భుతమైన కలెక్షన్లతో అదరగొట్టింది. ఏకంగా 1.5 మిలియన్ మార్కుకు చేరువైంది.

దీని తర్వాత వచ్చిన నాని సినిమాలు మూడూ (కృష్ణగాడి వీర ప్రేమ గాద, జెంటిల్ మాన్, మజ్ను) అమెరికాలో బాగానే ఆడాయి. నాని సినిమా అంటే మినిమం హాఫ్ మిలియన్ గ్యారెంటీ అన్న నమ్మకం యుఎస్ బయ్యర్లలో వచ్చేసింది. అతడి సినిమా ప్రతిదీ కనీసం వంద స్క్రీన్లలో రిలీజవుతోందక్కడ.

నాని కొత్త సినిమా ‘నేను లోకల్’ మీద అంచనాలు కొంచెం ఎక్కువగానే ఉండటంతో దీన్ని అతడి కెరీర్లోనే అత్యధికంగా 125 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారక్కడ. ఇది ఒక రకంగా సాహసమే అని చెప్పాలి. ‘నేను లోకల్’ విషయంలో ముందు నుంచి అగ్రెసివ్‌గా వెళ్తున్నారు దిల్ రాజు అండ్ కో. సినిమా మీద పాజిటివ్ బజ్ ఉండటం.. సంక్రాంతి సినిమాల సందడి తగ్గిపోవడంతో ఓపెనింగ్స్‌కైతే ఢోకా ఉండదు.

ఐతే సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి. టాక్ పాజిటివ్‌గా ఉంటే ‘భలే భలే మగాడివోయ్’ తర్వాత నాని మళ్లీ మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టే అవకాశముంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఫిబ్రవరి 3 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

(Visited 90 times, 1 visits today)

Related Post