ఖైదీ నంబ‌ర్ 150 మూవీ రివ్యూ మరియు రేటింగ్

విడుదల తేదీ : జ‌న‌వ‌రి 11, 2017

దర్శకత్వం : వి.వి.వినాయ‌క్

నటీనటులు : చిరంజీవి, కాజల్ అగర్వాల్

నిర్మాత : రామ్‌చ‌ర‌ణ్‌

సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌

తెలుగు సినీ ప్రేక్షకులు, మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘ఖైదీ నెం 150’. మెగాస్టార్ చిరంజీవి దాదాపు 9 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా కావడం, ఆయనకిది 150వ సినిమా కావడం వంటి కారణాలతో ఖైదీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇన్ని అంచనాలు నడుమ నేడే థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ఎలా ఉంది? అభిమానులను, ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో చూద్దాం..

కధలోకి వెళ్తే: తెలివిగా జైలు నుండి తప్పించుకున్న ‘ఖైదీ నెంబర్ 150’ కత్తి శీను (చిరంజీవి) ఎలాగైనా బ్యాంకాక్ వెళ్లిపోవాలని ట్రై చేస్తుండగా అనుకోకుండా ఒక ప్రమాదంలో అతను శంకర్ (చిరంజీవి) అనే వ్యక్తిని కాపాడుతాడు, అతడ్ని పోలీసులకి పట్టుబడేలా చేసి శీను బ్యాంకాక్ పారిపోవాలనుకుంటాడు. కానీ శంకర్ జీవితం మీద ఒక ఊరి రైతుల జీవితాలు ఆధారపడి ఉన్నాయని తరువాత తెలుసుకున్న కత్తి శీను షాక్ కు గురవుతాడు. అలా శంకర్ జీవితం గురించి తెలుసుకున్న శీను ఎలాంటి కీలక నిర్ణయం తీసుకున్నాడు ? ఏం చేశాడు ? అసలు శంకర్ గతమేమిటి ? శంకర్ ని నమ్ముకున్న రైతుల సమస్యలు ఏమయ్యాయి ? శీను వలన జైలుకు వెళ్లిన శంకర్ పరిస్థితేంటి ? అనేదే ఈ సినిమా కథ.

ఎలా ఉందంటే..?:  తమిళ “కత్తి” సినిమా కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ఓవరాల్ గా తెలుగు ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే బలమైన కథ, దేవిశ్రీ మ్యూజిక్, ఫైట్స్, మరియు ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేవిధంగా ఉన్నాయి. చిరంజీవి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..కాకపోతే 9 ఏళ్ల గ్యాప్ తర్వాత చిరు రీ ఎంట్రీ ఇవ్వడం తో అందరిలో తన యాక్టింగ్ గురించి , డాన్స్ , ఫైట్స్ గురించి ఒక టెన్షన్ పెట్టుకున్నారు..కానీ అదే స్టయిల్ , ఫైట్స్ లో అదే ఎనర్జీ,  కాకపోతే డాన్సుల్లో మాత్రం కాస్తా తగ్గాడు అనిపిస్తుంది ఇక కాజల్ విషయానికి వస్తే తన అందచందాల తో బాగానే ఆకట్టుకుంది.

మరోవైపు ప్రధానంగా సినీమా లో కనిపించేది బలం లేని ప్రతి నాయకుడి పాత్ర అనే చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి అంతటి స్టార్ హీరో ఇమేజ్ ని సినిమాలో డామినేట్ చెయ్యాలంటే అంతే బలమైన ప్రతి నాయకుడు అవసరం. ఆద్యంతం హీరోతో పోటీ పడుతూ హీరో పాత్ర బలంగా మారేలా చేయాలి. కానీ ఇందులో విలన్ పాత్ర అలా చేయలేదు. చిరంజీవి ముందు చాలా వరకు చిన్నబోయింది. అలీ , పోసాని కృష్ణమురళి నటన కూడా ఆకట్టుకుంది.

తనపై మోపిన అతిపెద్ద బాధ్యతను వీవీ వినాయక్ మర్ధవంతంగానే పోషించాడని చెప్పాలి. మురుగదాస్ కథను చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చి, అభిమానులు ఏయే అంశాలు కోరుకుంటారో అవన్నీ ఉండేలా చూసుకుంటూ, కథలోని ఎమోషన్ దెబ్బతినకుండా వినాయక్ చూపిన ప్రతిభ మెచ్చుకోదగ్గది. దర్శకుడిగా ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాను అందించడంలో వినాయక్ విజయం సాధించాడు. ఇకపోతే సెకండాఫ్ విషయంలో, ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో కాస్త జాగ్రత్త వహించి ఉంటే, సినిమా రేంజ్ వేరేలా ఉండేది.

ఓవరాల్ గా ఖైదీ నంబర్ 150 ప్రేక్షకులను మెప్పిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎవరెలా చేశారంటే..?: దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలన్నీ ఇప్పటికే సూపర్ హిట్. కొరియోగ్రాఫర్లు లారెన్స్, జానీ మాస్టర్లు చిరంజీవి చేత వేయించిన స్టెప్పులు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ కీలక సన్నివేశాలన్నింటిలో దేవిశ్రీ పనితనం చూడొచ్చు. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకో స్థాయిని తీసుకొచ్చింది. సాయిమాధవ్ బుర్రా రాసిన సంభాషణలు చాలా వరకు బలంగా తాకేలా, చిరు ఇమేజ్ కు తగ్గట్టు చాలా బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. రామ్ చరణ్ పాటించిన నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి.

బలాలు: 

  • చిరంజీవి యాక్టింగ్, ఫైట్స్
  • స్టోరీ
  • దేవి శ్రీ మ్యూజిక్
  • కాజల్ గ్లామర్

బలహీనతలు:

  • విలన్ రోల్
  • పండని కామెడీ ట్రాక్
  • క్లైమాక్స్

రేటింగ్:  3/5

Comments