పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘కాటమరాయుడు’ అనే సినిమా కొద్ది నెలలుగా నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా మార్చి నెలాఖర్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఫస్ట్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన టీమ్, తాజాగా టీజర్ విడుదలను వాయిదా వేసింది. కొత్త తేదీని కూడా ఇంకా నిర్ణయించలేదని, త్వరలోనే టీజర్ ఎప్పుడు విడుదల చేయనున్నది ప్రకటిస్తామని టీమ్ తెలిపింది.

నిజానికి సంక్రాంతికే ఈ టీజర్ విడుదలవుతుందనుకున్నా, అది కాస్తా జనవరి 26కు వాయిదా పడింది. ఇప్పుడు జనవరి 26న కూడా టీజర్ విడుదల కాకపోవడం అభిమానులను నిరుత్సాహపరచే అంశం. కాకపోతే వాయిదా కి గల కారణాలు తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు నిరాశ చెందలేదు కదా బదులుగా వాళ్లలో చాలా మంది దీనిపై కాటమరాయుడు టీంని ప్రశంసిస్తున్నారు.

ఎందుకంటే అదే రోజున పవన్ ట్వీట్స్ స్ఫూర్తితో, రెండు తెలుగు స్టేట్స్ నుంచి అభిమానులు 26న వైజాగ్ ఆర్కే బీచ్ లో షెడ్యూల్ చేసిన ఏపీ డిమాండ్స్ స్పెషల్ స్టేటస్ నిరసన మార్చ్ లో పాల్గొనేందుకు రావాలని పవన్ పిలుపునిచ్చారు. ఈ టైములో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి టీజర్ కంటే స్పెషల్ స్టేటస్ సమస్య ప్రధాన అంశంగా అనిపిస్తోంది అందుకనే ఎవరు టీజర్ వాయిదా పడినందుకు బాధపడనట్టు తెలుస్తుంది.

డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కాటమరాయుడు తమిళంలో మంచి విజయం సాధించిన వీరం రీమేక్‌గా ప్రచారం పొందుతోంది. పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

Comments

comments