విడుదల తేదీ: మే 5, 2017

దర్శకత్వం: నవీన్ మేడారం

నటీనటులు: శ్రీనివాస్ అవసరాల, శ్రీముఖి, తేజస్వి

నిర్మాత: అభిషేక్ పిక్చర్స్

సంగీతం: సునీల్ కశ్యప్

అష్ట చెమ్మ సినిమాతో న‌టుడుగా, రెండు సినిమాలతో ద‌ర్శ‌కుడిగా మంచి పేరు సంపాదించుకున్న అవ‌స‌రాల శ్రీనివాస్ హీరోగా చేసిన సినిమా `బాబు బాగా బిజీ`. బాలీవుడ్‌లో విజ‌య‌వంత‌మైన `హంట‌ర్‌` సినిమాకు ఇది రీమేక్‌. ఈ సినిమాతో న‌వీన్ మేడారం ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. మ‌రి న‌వీన్ రీమేక్ సినిమాను ఎలా హ్యాండిల్ చేశాడు. అడ‌ల్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఏ మేరకు మెప్పించిందో మన రివ్యూ లో తెలుసుకుందాం.

కథ:

మాధ‌వ్‌(అవ‌స‌రాల శ్రీనివాస్‌), వ‌ర‌ప్ర‌సాద్‌(ప్రియ‌దర్శి), ఉత్తేజ్‌(ర‌విప్ర‌కాష్‌)లు చిన్న‌ప్ప‌ట్నుంచి ప్రాణ స్నేహితులు. ముగ్గుర‌లో మాధ‌వ్‌కు అమ్మాయిలంటే చిన్న‌ప్ప‌ట్నుంచి ఆక‌ర్ష‌ణ ఉంటుంది. అమ్మాయిల‌ను, ఆంటీల‌ను ట్రాప్ చేయాల‌నే ఆలోచ‌న‌ల‌తోనే ఉన్న మాధ‌వ్‌కు, రాధ‌(మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి)ను ఇచ్చి పెళ్ళి చేయాల‌ని ఇంట్లోవాళ్ళు నిర్ణ‌యిస్తారు. అయితే ఎంగేజ్‌మెంట్ కంటే ముందు రాధ, మాధ‌వ్ గురించి పూర్తిగా తెలుసుకోవాల‌నుకుంటుంది. మాధ‌వ్‌కు కూడా రాధ అంటే ఇంట్రెస్ట్ క‌లిగి, ఆమెను ఇంప్రెస్ చేసే ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు కానీ త‌న‌కు అమ్మాయిల పిచ్చి ఉంద‌ని తెలిస్తే రాధ త‌న‌ను విడిచి ఎక్క‌డ వెళ్ళిపోతుందోన‌ని కూడా భ‌య‌ప‌డుతూ ఏదో ఒక‌లా మేనేజ్ చేస్తుంటాడు. కానీ అనుకోకుండా ఓ ఘ‌ట‌న మాధ‌వ్‌లో పెద్ద మార్పు తీసుకొస్తుంది. అదేంటి? మాధ‌వ్ రాధ‌కు త‌న గురించిన‌ నిజం చెప్పాడా? రాధ చివ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..?:

రీమేక్ కథలను ఎన్నుకున్నా.. ఓ దర్శకుడు ఆ కథకు తన స్టయిల్‌ను జోడించి కొత్తగా ప్రెజంట్ చేయడానికే ఇష్టపడతాడు. ఆ రకంగా వచ్చిన చాలా రీమేక్ సినిమాలు విజయాలను అందుకున్నాయి. కానీ ఈ సినిమాను మాత్రం ‘హంటర్’లో ఏ ఒక్క సన్నివేశాన్ని మార్చకుండా మక్కీకి మక్కీ దించేశారు. ‘హంటర్’ సినిమా చూసిన తరువాత ‘బాబు బాగా బిజీ’ సినిమాను చూడాల్సిన పనేలేదు అనే అనువభం మనకి కలుగుతుంది.

అడల్డ్ రొమాంటిక్ కామెడీలో బలమైన కథ ఉంటే తప్ప టాలీవుడ్‌లో సక్సెస్ అయిన సినిమాలు చాలా తక్కువ. దేశవ్యాప్తంగా సంచలనం విజయం సాధించిన విక్కీ డోనర్ సినిమాను తెలుగులో సుమంత్ తో రీమేక్ చేస్తే ఫలితం ఏమైందో తెలుసు. హిందీలో హంటర్ మెట్రో కల్చర్ ఉన్న సినిమా. బాలీవుడ్‌ పరిధి, ఆ ప్రేక్షకుల అభిరుచి కొంత భిన్నమైనది కాబట్టి అంతో ఇంతో ఆదరించారు. టాలీవుడ్ ప్రేక్షకుల టేస్ట్ చాలా ట్రేడిషనల్. కథ ఏ మాత్రం గీత దాటినా ఆమోదించడానికి ఇష్టపడరు. అలాంటి చరిత్ర ఉన్న టాలీవుడ్‌లో బాబు బాగా బిజీ లాంటి సినిమాను అటెంప్ట్ చేయడం సాహసమే. ఫ్యామిలీ లుక్ ఉన్న అవసరాలను ఎంచుకోవడం మరో సాహసం. ఇలాంటి సాహసాలను భుజాన ఎత్తుకొని సినిమా తీశారంటే కథను ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగానైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సిందేమో. నేపథ్య సంగీతం, పాటలు అంత గొప్పగా లేకపోవడం ప్రేక్షకుడిని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది.

ఈ చిత్రంలో సెక్స్ ఎడిక్ట్‌ మాధవ్‌గా అవసరాల శ్రీనివాస్ మెప్పించాడు. చంద్రిక అనే గృహిణి పాత్రలో సుప్రియ కనిపించారు. భర్త ప్రేమకు దూరమై పరాయి వ్యక్తి ప్రేమ కోసం తపించే పాత్రను పోషించారు. ఎలాంటి సందేహాలు లేకుండా ఈ పాత్రను ఆమె పోషించి ఆ పాత్రకు మంచి పేరుని తెచ్చారు. కాకపోతే ఆ పాత్రకు జస్టిఫికేషన్ లేకపోవడంతో అసంపూర్ణంగా మిగిలిపోయింది. రాధ పాత్రలో మిస్తి చక్రవర్తి నటించారు…కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన బాగున్నది.

అవసరాల శ్రీనివాస్ మాయలో పడిన అమ్మాయిగా తేజస్విని ఒకట్రెండ్ సీన్లలో బోల్డ్‌గా కనిపించి మెప్పించింది. శోభ నటరాజన్ పాత్రలో టీవీ యాంకర్ శ్రీముఖి కనిపించారు. అంతగా ప్రాధాన్యం లేని ఒకట్రెండు సీన్లలో కనిపించినా అంతగా గుర్తుండిపోయే పాత్రేమీ కాదు. ఇక మిగిలిన నటి నటులు వారి వారి పాత్రలకు పరిమితమయ్యారు. దర్శకుడు నవీన్ మేడారం తోలి ప్రయత్నం లోనే విఫలమయ్యాడని చెప్పవచ్చు. నవీన్ కధ, కధనం ఫై కాస్త శ్రద్ద పెట్టివుంటే బాగుండేది. సునీల్ కశ్యప్ సంగీతం పెద్దగా మాట్లాడుకునే స్థాయిలో లేదు. ఎడిటింగ్ కూడా సినిమాకి మైనస్ గా చెప్పుకోవచ్చు.

 

…………………….మొత్తం మీద బాబు బాగా బొర్ కొట్టించాడు………………………..

బలాలు:

  • అవసరాలశ్రీనివాస్
  • సుప్రియ యాక్టింగ్

బలహీనతలు:

  • కథ
  • కథనం
  • మ్యూజిక్ ఎడిటింగ్

రేటింగ్: 2.25 /5

 

(Visited 4,661 times, 1 visits today)

Related Post