సాధారణంగా ఒక తెలుగు సినిమా ట్రైలర్ కోసం తెలుగు అభిమానులు ఎదురుచూస్తుంటారు, మహా అయితే తమిళ, కన్నడ, మలయాళీ ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు కానీ బాహుబలి సంగతి మాత్రం వేరు. అది ఇండియా ని దాటి తెలుగు సినిమా సత్తా ని ప్రపంచంలోని సినిమా అభిమానుల అందరికి పరిచయం చేసింది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి 2 ట్రైలర్ రానే వచ్చింది. ఈ ట్రైలర్ ద్వారా జక్కన్న తాను చెక్కిన మహా శిల్పం బాహుబలి 2 ఎలా ఉండబోతోందో పరిచయం చేశారు. ఈ ట్రైలర్ ద్వారా జక్కన్న బాహుబలి 2 లో ఎం చూపించబోతున్నారో, సినిమా ఎలా ఉండబోతోందో ఊహించే ఓ చిన్న ప్రయత్నం చేద్దాం.

ట్రైలర్ చూసి మొత్తం కథని ఊహించడం చాల కష్టం, కానీ ట్రైలర్ లో చూపించిన సన్నివేశాలన్నీ ఒక వరుస క్రమంలో పెట్టి బాహుబలి 2 మూలకధ ఏంటో ఊహించే ప్రయత్నం చేద్దాం… బాహుబలి 1 లో యుద్ధం గెలిచాక శివగామి అమరేంద్ర బాహుబలి ని కాబోయే మహారాజు గా ప్రకటిస్తుంది. ఈ ట్రైలర్ లో మొదటి సీన్ తో అమరేంద్ర బాహుబలి శివగామి ప్రకటించినట్లే మాహిష్మతి రాజ్యానికి మహారాజు అవుతాడు.

ప్రభాస్ గుర్రం పై వెళ్లే సీన్, అక్కడే శత్రువులతో పోరాడుతున్న అనుష్క, ప్రభాస్ చేతితో ఆయుధాన్ని తిప్పుతూ నవ్వూతూ నడుస్తున్న సీన్స్ చుస్తే అది వాళ్ళ ఇద్దరికి ఇంట్రడక్షన్ సీన్ అనుకోవచ్చు, ఆలా కలిసిన అమరేంద్ర బాహుబలి దేవసేన  ప్రేమలో పడతారు. దేవసేనని భల్లాలదేవుడు కూడా ఇష్టపడతాడు, కానీ అప్పటికే బాహుబలిని ప్రేమించిన దేవసేన భల్లాలదేవుడిని తిరస్కరిస్తుంది. అప్పటికే రాజ్యాన్ని కోల్పోయిన భల్లాలదేవుడు, దేవసేనని కూడా కోల్పోయేసరికి పగతో రగిలి పోతూ సమయం కోసం ఎదురు చూస్తుంటాడు.

అమరేంద్ర బాహుబలికి దేవసేనకి కొడుకు పుడతాడు, ఒకరోజు అకస్మాత్తుగా కోటపై శత్రువులు దాడి చేసే సన్నివేశాలు ట్రైలర్ లో చూడొచ్చు, ఈ సన్నివేశాలను బట్టి పగతో రగిలిపోతున్న భల్లాలదేవుడు శత్రువులతో చేతులు కలిపి కోటపై దాడి చేయిస్తాడు. ట్రయిలర్ లో రక్తం తో తడిచిన ఒక మహిళ చేయి శివగామి కాలుని పట్టుకునే సీన్ ని బట్టి, కోటపై దాడి చేసిన శత్రువులు దేవసేనని చిత్రహింసలు పెడతారు, తన కొడుకుని ఎలాగైనా కాపాడమని శివగామిని దేవసేన ప్రాధేయపడుతూ కాళ్లు పట్టుకుంటుంది.

బాహుబలి 1 సినిమా ఫస్ట్ సీన్ ని బట్టి శివగామి ఆ పిల్లాడిని తీసుకుని పారిపోతుంది. భల్లాలదేవుడు దేవసేనని బంధిస్తాడు. అదేసమయంలో శత్రువులతో పోరాడుతున్న బాహుబలిని కట్టప్ప వెనకనుండి పొడిచి చంపుతాడు. ఆలా రాజును కోల్పోయిన మాహిష్మతి రాజ్యానికి భల్లాలదేవుడు రాజవుతాడు. భల్లాలదేవుడితో శివుడు తలపడే సన్నివేశాలనుబట్టి, కట్టప్ప ద్వారా జరిగిని విషయాలు తెలుసుకున్న శివుడు బల్లదేవుడిని చంపి తన తండ్రి హత్య కి ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇలా ట్రైలర్ లోని సన్నివేశాలను బట్టి, బాహుబలి 1 లో జరిగిన కథను బట్టి బాహుబలి 2 కథ ని కొంతవరకు ఊహించొచ్చు, కానీ కొన్ని ప్రశ్నలకి సమాధానాలు మాత్రం సినిమా చూడకుండా చెప్పడం చాల కష్టం, అవేంటంటే

1. బాహుబలి 1 లో శివగామి నదిలో మునిగిపోతూ “పరమేశ్వర… నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం నా ప్రాణాలైతే తీసుకో, కానీ మహేంద్ర బాహుబలి బ్రతకాలి” అనే డైలాగ్ ని బట్టి, అమరేంద్ర బాహుబలి హత్య వెనుక శివగామి హస్తం ఎంతవరకు వుంది ?? ఎలాంటి పరిస్థితులలో ఆ పాపం చేయాల్సి వచ్చింది ?
2. బాహుబలి 1 లో ఓడిపోయిన కాలకేయులు మాహిష్మతి పై ఎలాంటి ప్రతీకార చర్యకి పాల్పడ్డారు
3. రాజ్యాన్ని దక్కించుకోవడానికి బిజ్జలదేవుడు, భల్లాలదేవుడు ఎలాంటి పన్నాగాలు పన్నారు ?
4. మహేంద్ర బాహబలి, భళ్లాలదేవుడిపై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు ? అతనికి ఎవరెవరు సహాయం చేసారు ??
5. చివరిగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి ?

వీటన్నిటికీ సమాధానాలు దొరకాలంటే మాత్రం ఏప్రిల్ 28 వరకు ఈ ట్రైలర్ చూస్తు సినిమా కోసం ఎదురు చూడాల్సిందే.

 

(Visited 437 times, 1 visits today)

Related Post