నలుగురు హీరోలతో సినిమా తీస్తే ఎలా ఉంటుంది ?? తియ్యడానికి ఎలా వుంటుందోగాని… చూడ్డానికి మాత్రం ప్రేక్షకులకి పండగే. మరి అలంటి సాహసం ఇప్పుడు మన టాలీవుడ్ లో “భలే మంచి రోజు” చిత్ర దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య చేయబోతున్నారు. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో సంచలనం అవుతోంది. ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్‌ మూవీ తీసేందుకే కొందరు దర్శకులు ఆలోచిస్తుంటే, ఏకంగా నలుగురు హీరోలతో పాటు, ఓ సీనియర్‌ నటుడితో మల్టీస్టారర్‌ మూవీకి శ్రీకారం చుట్టారు. నారా రోహిత్, సందీప్‌ కిషన్, సుధీర్‌బాబు, ఆది హీరోలుగా, డా. రాజేంద్రప్రసాద్‌ ప్రత్యేక పాత్రలో శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వి.ఆనంద్‌ ప్రసాద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు శ్రీను వైట్ల క్లాప్‌ ఇచ్చారు. ఈ చిత్రానికి “శమంతకమణి” అనే టైటిల్ ఖరారు చేశారు .

నటుడు రాజేంద్రప్రసాద్‌ గౌరవ దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘నటుడిగా నలభై ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఆనంద్‌ ప్రసాద్‌గారితో ‘అమ్మాయి నవ్వితే’ సినిమా చేశా. నలుగురు హీరోలున్న ఈ మల్టీస్టారర్‌ చిత్రంలో నేను కీలకపాత్ర చేస్తున్నా. మేమంతా కలిసి చేస్తున్న ఈ సినిమా గ్యారంటీ హిట్‌ అవుతుంది’’ అన్నారు. శ్రీరామ్‌ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘ఇంజనీరింగ్‌ పూర్తి కాగానే ఫేస్‌బుక్‌లో ఉద్యోగం చేసే టైమ్‌లో రాసుకున్న తొలి కథ ఇది. ఈ కథ చాలామందికి వినిపించా.

‘నలుగురు హీరోలు కలిసి తెలుగులో సినిమా ఎక్కడ చేస్తారు.. ఇది అసాధ్యం’? అన్నారందరూ. ఈ కథ వినగానే ఆనంద్‌ ప్రసాద్‌గారు ఎగ్జయిట్‌ అయ్యి, మనం సినిమా చేద్దామన్నారు. ఇంత మంది హీరోలు తెలుగులో చేస్తున్న తొలి సినిమా ఇది. భారీ మల్టీస్టారర్‌ చిత్రాలకు మా సినిమా నాంది పలుకుతుంది’’ అన్నారు. ‘‘మార్చి మొదటి నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది’’ అని ఆనంద్‌ ప్రసాద్‌ తెలిపారు.

Comments

comments